
వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఈ ఏడాది మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. ఈకేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల హత్య కేసులో తమకు సంబంధం లేదని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది.
Also Read: TTD: వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్‌కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు!
హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులను అరెస్టు చెయ్యవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని పిన్నెల్లి సోదరులకు సూచించింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ను రెండు సార్లు పోలీసులు విచారించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పిన్నెల్లి సోదరులకు బెయిల్ ఇవ్వద్దంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులకు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేసింది. రెండు వారాల్లోపు సరెండర్ కావాలని సూచించింది.