
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరుగుతుందని పేర్కొంది.
ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నట్లుగా రష్యా వార్త సంస్థ క్రెమ్లిన్ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అధికారిక ప్రకటనలో ధృవీకరించింది.
ఇక పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలో ప్రధాని మోడీతో చర్చలు జరుపుతారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పుతిన్‌కు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. అధ్యక్షుడు గౌరవార్థం ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మోడీతో పాటు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.
పుతిన్ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఈ సమావేశం జరుగుతుందని పేర్కొంది. ఇరు దేశాల సహాయ సహకారాలపై దిశానిర్దేశం చేసుకుంటాయని వెల్లడించింది. రెండు దేశాల పురోగతికి ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపింది.