
Railway Line : దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రైల్వే శాఖ నుండి చివరకు ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. ఈ నిర్ణయంతో పెద్దపల్లి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైల్వే సమస్యల పరిష్కారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలిస్తున్నదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైందని, సుమారు రూ. 4 వేల కోట్లు వ్యయంతో ఈ కొత్త రైల్వే మార్గం నిర్మాణానికి రైల్వే శాఖ ముందుకు వస్తుండటం చారిత్రక పరిణామంగా భావిస్తున్నానని తెలిపారు.
Localbody Elections : ఎన్నికల బరిలో మాజీ మావోయిస్టు జ్యోతి
ఈ లైన్ వల్ల సింగరేణి కార్మికులు, ప్రాంతీయ ప్రజలు, బొగ్గు రవాణా వ్యవస్థకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ప్రయాణ సౌకర్యాలు భారీగా మెరుగుపడటంతో పాటు, దేశవ్యాప్తంగా జరుపుకునే సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్న వేలాది మంది భక్తులకు ఇది గొప్ప ప్రయోజనం కానుందని పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్‌తో మంథని, మేడారం భక్తులకు ప్రత్యేక కనెక్టివిటీ లభిస్తుందని తెలిపారు. గత పదేళ్లుగా అభివృద్ధి విషయంలో వెనుకబడిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగానే ఈ ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యంగా తీసుకున్నానని ఎంపీ వంశీ స్పష్టం చేశారు. పెద్దపల్లి–మంచిర్యాల ప్రాంతాల్లో రైల్వే లైన్లు, రోడ్లు, NH-63 అభివృద్ధి తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.