Ram Madhav: యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదు.. పీకేపై రామ్ మాధవ్ విసుర్లు

Ram Madhav Criticism Of Prashant Kishor

యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదని ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్‌ మాధవ్ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పని తీరుపై రామ్ మాధవ్ విమర్శలు గుప్పించారు. జన్ సురాజ్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదని.. ప్రశాంత్ కిషోర్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు. ఏ నాయకుడైనా యుద్ధ భూమి నుంచి పారిపోతే.. ఏ పార్టీ అయినా ఎలా మనుగడ సాధిస్తుందని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Hong Kong fire: 94కు చేరిన అగ్నిప్రమాద మరణాలు.. పలువురు ఆచూకీ గల్లంతు

ఇక రాహుల్ ‌గాంధీని ఎవరూ కూడా సీరియస్‌గా తీసుకోరని.. అలాగే ఓట్ చోర్ వ్యవహారాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ పట్టించుకుంటే ఫలితాలు వేరేలా ఉండేవని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సీరియస్ లేని నాయకుడు.. ఆయన ఎప్పుడూ చట్టబద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొనరని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను బట్టి రాహుల్ మాటలను బీహారీయులు నమ్మలేదని అర్థమవుతుందన్నారు.

ఇది కూడా చదవండి: Bihar Video: నడిరోడ్డుపై ఆకతాయి స్టంట్లు.. హడలెత్తిపోయిన విద్యార్థినులు

‘SIR’ అనేది ఎన్నికల సంఘానికి సంబంధించిదని.. అంతే తప్ప ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. నకిలీ ఓటర్లను తొలగించడానికి ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను సమీక్షించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియ బీహార్‌లో విజయవంతంగా పూర్తయిందని.. 65 లక్షల మంది ఎంట్రీలు నకిలీలు, బోగస్ ఎంట్రీలు అని తేలిందని చెప్పారు. నిజమైన ఓటర్ల పేర్లు ఎక్కడికి పోవని తెలిపారు. ఇక ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశం వెలుపల పని చేయదని తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్‌లో ఉండే ప్రతి పైసా ఆడిట్ అవుతుందని వివరించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 202 స్థానాలు గెలుచుకుంది. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.