Rashi Khanna: నా కంఫర్ట్‌ జోన్ దాటి దిగజారిపోయే పాత్రలు నాకొద్దు..

Rashi Khanna On Role Selection Career Shift Comfort Zone

సౌత్‌లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించిన గ్లామరస్ స్టార్ రాశీ ఖన్నా, ఇప్పుడు తన కెరీర్ దిశను మార్చుకునేందుకు సిద్ధమైందని చెబుతోంది. నటనకు ప్రాధాన్యమున్న, కథ బలం గల పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన ‘120 బహాదుర్‌’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశీ, పాత్రల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read : Savitri : మహానటి 90వ జయంతి సందర్భంగా .. సావిత్రి మహోత్సవం

“దక్షిణాదిలో నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. వాటితో నాకు గుర్తింపు వచ్చింది, ప్రేక్షకుల ప్రేమ దక్కింది. కానీ ఇకపై హిందీలో మరింత కథా ప్రాధాన్యమున్న, నటనను పరీక్షించే పాత్రలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. వాణిజ్య చిత్రాలు చేయడం ఇష్టమే కానీ ప్రతి విషయం కి ఒక హద్దు ఉంటుంది” అని రాశీ తెలిపింది.

తన వ్యక్తిగత కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతూ..“నేను ఎంచుకునే పాత్రలో నాకే కంఫర్ట్‌గా ఉండాలి. కొన్నిసార్లు పాత్రలు నా లిమిట్ దాటి వెళ్లేలా ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి సందేహం లేకుండా నో చెప్పేస్తాను. ఆ పాత్రలో నేను దిగజారిపోయేలా కనిపిస్తానని అనిపించినా కూడా ఒప్పుకోను. ప్రతి నటికి తనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. దానిని గౌరవించడం తప్పు కాదు. నేను ఇతరులను జడ్జ్ చేయను, కానీ నాకు నచ్చని ఎంపికలను మాత్రం నేను చేయను” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాశీ ఖన్నా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తో పాటు పలు తెలుగు, హిందీ ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది. తన కెరీర్‌లో కొత్త దశను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ఆమె, కంటెంట్ ఆధారిత పాత్రలతో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యం పెట్టుకుంది.