
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ ముందు నిలిచాడు. మరో మూడు సిక్స్‌లు కొడితే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈరోజు రాంచి వేదికగా దక్షిణాఫ్రికా జరగనున్న తొలి వన్డేలో రోహిత్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్.. రాంచి వన్డేలోనే ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాంచిలో కాకపోయినా.. రాయపూర్, విశాఖపట్నం వన్డేలలో అయినా హిట్‌మ్యాన్ ఈ రికార్డును ఖాతాలో వేసుకోనున్నాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా ప్రస్తుతం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది 398 వన్డేల్లో 351 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 276 వన్డేలు ఆడి 349 సిక్స్‌లు బాదాడు. హిట్‌మ్యాన్ మరో రెండు సిక్స్‌లు కొడితే.. అఫ్రిది రికార్డు సమం చేస్తాడు. మూడు సిక్స్‌లు బాదితే తొలి స్థానం కైవసం చేసుకుంటాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (331), సనత్ జయసూర్య (270), ఎంఎస్ ధోనీ (229)లు టాప్ 5లో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో హిట్‌మ్యాన్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సుదీర్ఘ కెరీర్ ఆడే ఆటగాళ్లకు కూడా ఈ రికార్డు బహుశా సాధ్యం కాకపోవచ్చు.
Also Read: SIM Binding: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!
రోహిత్ శర్మకు ‘హిట్‌మ్యాన్’ అనే ట్యాగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇది ఊరికే రాలేదు. సునాయాసంగా సిక్స్‌లు కొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇతర బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బౌన్సర్లను సైతం రోహిత్ తన పుల్ షాట్‌తో అలవోకగా సిక్స్‌లుగా బాదేస్తుంటాడు. మైదానం నలు వైపులా సిక్స్‌లు కొట్టే సామర్థ్యం రోహిత్ సొంతం. కెరీర్ ఆరంభం నుంచి హిట్‌మ్యాన్ అలవోకగా సిక్స్‌లు బాదేస్తున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా రోహిత్ 200 లకు పైగా సిక్స్‌లు బాదాడు. టెస్టులో 88 సిక్స్‌లు కొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 302 సిక్స్‌లు బాదాడు.