Savitri : మహానటి 90వ జయంతి సందర్భంగా .. సావిత్రి మహోత్సవం

Savitri 90th Birth Anniversary Savitri Mahotsavam December 1

తెలుగు సినీ ప్రపంచంలో తన అమోఘ నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి సావిత్రి గారి 90వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని, ‘సావిత్రి మహోత్సవం’ పేరుతో ప్రత్యేక వేడుకలు ఏర్పాటు చేయబడుతున్నాయి. డిసెంబరు 1 నుంచి 6 వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సంగమం ఫౌండేషన్‌తో కలిసి ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి అధికారికంగా ప్రకటించారు.

ఈ ప్రత్యేక వారోత్సవంలో భాగంగా సావిత్రి నటించిన క్లాసిక్ సినిమాల ప్రదర్శనలు, పాటల పోటీలు మరియు ఆమె కళా జీవితాన్ని స్మరించుకునే కార్యక్రమాలు జరుగనున్నాయి.  ఈ సభలో ‘మహానటి’ సినిమా ద్వారా సావిత్రి గారి వ్యక్తిత్వాన్ని అందంగా పెద్ద తెరపై చూపించిన దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్‌లను ప్రత్యేకంగా సత్కరించనున్నారు. అలాగే ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక రచయిత సంజయ్ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలకు కూడా గౌరవాలు అందజేయనున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానుండటం ఈ మహోత్సవానికి మరింత ప్రతిష్టను తీసుకొచ్చింది. సావిత్రి కళా జీవితాన్ని మరలా వెలుగులోకి తీసుకురానున్న ఈ ‘సావిత్రి మహోత్సవం’ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.