
Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్‌ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలను మోసగించేందుకు, అధికార పార్టీ నిర్మించేందుకు పది రోజులపాటు దీక్షా దివస్ నిర్వహిస్తారట.. ఇప్పుడు పది రోజులు డబ్బా కొట్టుకునేందుకు రెడీ అయ్యారని విమర్శించారు. ప్రజలకు పదేండ్లలో చేసిన అభివృద్ధి ఏంటో దీక్షా దివాస్ లో చెప్పాలన్నారు. రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఎంతోచేసింది.. విజయాలను ప్రజలకు వివరించేందుకు మేము 10 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మా విజయోత్సవాలను అడ్డుకునే కుట్రతోనే దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఆకాంక్ష దశాబ్దాల నుంచి ఉంది.. కేసీఆర్ దీక్ష గుట్టు నిమ్మరసానికి ఎరుక.. తెలంగాణ వచ్చాక వందల రెట్లు లబ్ది పొందింది కేసీఆర్ కుటుంబమని మంత్రి సీతక్క విమర్శించారు. “బీఆర్ఎస్ దగ్గర అధికారం మాత్రమే లేదు. కోట్లాది రూపాయలు ఉన్నాయి.. దోచుకున్న డబ్బులతో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కార్యక్రమాలైనా చేస్తారు.. మేం చెప్పినట్టే రాష్ట్ర ప్రజలు వినాలి అనేలా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు.. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటాం. లేకపోతే బయటకే రావొద్దని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు..” అని వ్యాఖ్యానించారు.