
Siliguri corridor: గతేడాది హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉంది. పాకిస్తాన్, చైనాతో అంటకాగుతూ భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఇటీవల, పాక్-బంగ్లాల మధ్య రక్షణ, వ్యాపార-వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా, పాక్ సైనికాధికారులు, ఐఎస్ఐ అధికారులు తరుచుగా బంగ్లాదేశ్‌లో పర్యటించడం భారత్‌ను కలవరపెడుతోంది.
Read Also: Jihad Controversy: జిహాద్ పుట్టడానికి కారణం ఇదే.. జమియత్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలిపే అత్యంత కీలకమైన ‘‘సిలిగురి కారిడార్’’పై బంగ్లాదేశ్, పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 22 కి.మీ వెడల్పు మాత్రమే ఉండే ఈ ఇరుకైన ప్రాంతాన్ని బ్లాక్ చేస్తే మిగతా భారత్‌తో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ కీలకమైన ప్రాంతంలో భారత్ మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేయబోతోంది. ఇది ఒక విధంగా బంగ్లాకు హెచ్చరిక లాంటిది. ధుబ్రీ సమీపంలోని లచిత్ బోర్పుకాన్ మిలిటరీ స్టేషన్, బీహార్ కిషన్ గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని చోప్రా వద్ద ఉన్న ఫార్వర్డ్ బేస్‌లతో పాటు రక్షణ గార్రిసన్లుగా మాత్రమే కాకుండా, వేగవంతమైన దళాల మోహరింపు, నిఘా విభాగాలు, పారా స్పెషల్ ఫోర్సెస్‌తో కూడి వ్యూహాత్మక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. సిలిగురి కారిడార్ రక్షణలో ఏ మాత్రం రాజీ పడకుండా ఉండేందుకు ఈ సైనిక స్థావరాలు సహాయపడుతాయి.
ప్రతిపాదిత చోప్రా సైనిక స్థావరం బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి బంగ్లాలో నిఘా పెట్టడం, అవసరమైతే వేగంగా సైనిక మోహరింపు, సరిహద్దు వెంబడి ఆపరేషన్లను తీవ్రం చేయవచ్చు. ఇప్పటికే సిలిగురి కారిడార్‌లో భారత్ రాఫెల్ యుద్ధవిమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసింది. మరోవైపు, బంగ్లాదేశ్ చైనాతో రక్షణ ఒప్పందాలను కుదర్చుకుంటోంది.బంగ్లాదేశ్ $2.2 బిలియన్ల విలువైన చైనీస్ J-10C ఫైటర్లను కొనుగోలు చేయాలని యోచిస్తోంది, డ్రోన్ తయారీలో బీజింగ్‌కు సహకరిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి, పాకిస్తాన్ JF-17 బ్లాక్ C థండర్ జెట్లను అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే భారత్ సిలిగురి కారిడార్‌లో సైనిక సామర్థ్యాలు పెంచుతోంది.