
Story Board: తెలంగాణలో ఎన్నో తర్జనభర్జనల తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎప్పటిలాగానే ఏకగ్రీవాల సంస్కృతి కూడా ఊపందుకుంది. ఏకగ్రీవాలు చేసుకున్న గ్రామాలకు నజరానాలు, ప్రోత్సాహకాలు ఇచ్చే పని ప్రభుత్వాలు దశాబ్దాల కిందటే మొదలుపెట్టాయి. తద్వారా గ్రామాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని కాపాడటంతో పాటు అనవసర వివాదాల్ని నివారించే ఉద్దేశం కనిపిస్తోంది. అలాగే గ్రామాభివృద్ధిని వేగంగా పట్టాలెక్కించవచ్చనే ఆలోచన ఉంది. కాకపోతే అన్ని మంచి సంస్కృతులూ భ్రష్టుపట్టినట్టే.. ఏకగ్రీవాల కల్చర్‌కు కూడా చెదలు పట్టడం మొదలైంది. ప్రతి గ్రామంలో వర్గాలకు అతీతంగా.. అందరూ కలిసి కూర్చుని, మాట్లాడుకుని.. ఏకగ్రీవం చేసుకోవటం అందరికీ ఆదర్శం. అలా ఆదర్శంగా జరిగిన ఏకగ్రీవాలతో ఏ సమస్యా లేదు. కానీ కొన్నాళ్లుగా ఏకగ్రీవాలకు కూడా అవలక్షణాలు అంటగట్టారు. డబ్బులు, ప్రలోభాలు, బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకునే విష సంస్కృతి మొగ్గ తొడిగింది. దీంతో ఆదర్శ ఏకగ్రీవాల కంటే బలవంతపు ఏకగ్రీవాల కంపు పెరిగిపోతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. బలవంతపు ఏకగ్రీవాలపై ఓ కన్నేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తదనుగుణంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఏకగ్రీవాలు చేయాల్సిన విధానం, ప్రకటించాల్సిన తీరుపై మార్గదర్శకాలు జారీ చేసింది.
ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ వేసిన పక్షంలో అక్కడ పదవుల వేలంపాట, బెదిరింపు, ప్రేరణ, ఒత్తిడి, బలవంతపు ఉపసంహరణలు జరిగినట్లు ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి, నిజమని తేలితే ఫలితాలను ప్రకటించవద్దని సూచించింది. ఫిర్యాదులు రాని పక్షంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న, ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులతో స్వీయ ధ్రువీకరణపత్రాలు రాయించుకున్న తర్వాతే ఫలితాలు వెల్లడించాలని సూచించింది. పలు గ్రామాల్లో పదవుల వేలం, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి వాటిని నిరోధించి పూర్తిగా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించాలని కోరింది.
పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవ ఎన్నికలపై లిఖితపూర్వకంగా, మౌఖికంగా, వాట్సప్ ద్వారా ఫిర్యాదులు వచ్చినా అలానే వార్తాపత్రికల్లో ప్రచురితమైనా వాటిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దీనిపై ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు స్వచ్ఛందంగా నా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నానని ఎలాంటి భయం, బెదిరింపు, వేలంపాట ఒత్తడి, ఆర్థిక ప్రేరణకు గురికాలేదని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రం రాసి ఇవ్వాలి. ఇది జిల్లా ఎన్నికల అథారిటీ, ప్రత్యేక పర్యవేక్షణ విభాగం నుంచి ఈ నివేదిక అందిన అనంతరమే ఎన్నిక ఫలితాన్ని ప్రకటించాలి. ఫిర్యాదు అందితే పర్యవేక్షణ విభాగం 24 గంటల్లోపు విచారణ జరిపి ఆయా గ్రామ పంచాయతీలు, వార్డులలో ఎన్నికను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించాలి.
పంచాయతీ రాజ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,935 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 162 అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతోంది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించిన విధివిధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, అవతలి వ్యక్తిని భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు, రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా? లేదా? అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు. ఫిర్యాదులు లిఖితపూర్వకంగా, వాట్సాప్ ద్వారా, మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల రూపంలో కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.
సర్పంచ్, వార్డు స్థానానికి ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేసమయంలో పోటీలో ఉన్న ఒకేఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బు ఎర చూపలేదని, వేలంపాటలో పాల్గొనడం, బెదిరింపులకు పాల్పడడం వంటివి చేయలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణకు వస్తే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలి. ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించి, వాటిపై ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలి. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే.. ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఏకగ్రీవ సంస్కృతిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001 నుంచి అమలు చేస్తున్నారు. 2006లోనూ ప్రోత్సాహకాలు ప్రకటించారు. 2013 వచ్చేనాటికి ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం అనేక రెట్లు పెరిగింది.ఉమ్మడి రాష్ట్రంలో 2013 జులైలో పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. జులై 23, 27, 31 తేదీల్లో చేపట్టారు. అప్పట్లో మొత్తం 21,441 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా… అందులో 2,422 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా… ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 202, నెల్లూరు జిల్లాలో 194 గ్రామ పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇలా దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఏకగ్రీవాల్ని ప్రోత్సహించే విధానం కొనసాగుతోంది. దీని వెనుక గ్రామీణాభివృద్ధి నిపుణులు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదుల సిఫార్సులు, సలహాలు ఉన్నాయి. అసలు ఏకగ్రీవం ఎలా చేయాలి.. దేన్ని ఏకగ్రీవం అనాలనే విషయాలపై కూడా మొదట్లోనే స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేశారు. తొలిరోజుల్లో ఇవి కఠినంగానే అమలైనా.. కాలక్రమంలో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో.. ఇక్కడ కూడా బలవంతపు ఏకగ్రీవాలు మొగ్గతొడిగి.. చివరకు అసలు ఏకగ్రీవం కంటే.. కొసరు ఏకగ్రీవాలు ఎక్కువయ్యే దుస్థితికి వచ్చింది. అలా మొత్తంగా ఏకగ్రీవం సంస్కృతే తప్పని భావించేలా పరిస్థితి దిగజారే ప్రమాదం ఏర్పడింది. దీంతో తెలంగాణ ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఏకగ్రీవ సంస్కృతిని కాపాడుకుంటూనే.. ఆ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపాలని డిసైడైంది.