
Telangana Panchayat Elections 2025: అనుకున్నదొక్కటి… అయింది ఒక్కటీ… అన్నట్టుగా మారిందట ఆ వ్యక్తి పరిస్థితి… గ్రామానికి సర్పంచ్ కావాలన్నది అతడి కల.. ఇన్నాళ్లుగా అతనికి వివిధ కారణాలతో ఆ పదవి దక్కలేదు.. ఈసారి ఆ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో.. ఇంతకాలం పెళ్లి చేసుకొని ఆ సీనియర్ బ్యాచిలర్ ఉన్నపళంగా నిశ్ఛితార్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. మహిళా రిజర్వేషన్ కావడంతో పెళ్లి చేసుకుంటే తన భార్యకు అయినా పదవి దక్కుతుందని ఆయన వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.. అతని కల నెరవేరకపోయినా… ఓ ఇంటి వాడైతే అయ్యాడు… లోకల్ ఫైట్ లోని పదనిసల్లో.. ఆ నాయకుడికి రివర్స్ ఎందుకు అయింది? అసలేం జరిగింది..? ఎక్కడ జరిగింది ఈ సిత్రం…? పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ పంచాయితీ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా సర్పంచ్ పీఠం దక్కించుకోవాలన్నది ముచ్చె శంకర్ అనే నాయకుడి చిరకాల కోరిక…. నాయకుడిగా నిలదొక్కుకున్నకే పెళ్లి అని వివాహాన్ని వాయిదా వేసేసాడు శంకర్.. ఈ తరుణంలోనే వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో నాగిరెడ్డిపూర్ పంచాయితీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ అయింది… కానీ, అప్పటికి తాను అవివాహితుడు. దాంతో తనకు పీఠం దక్కే అవకాశం లేకపోవడంతో… బాగా ఆలోచన చేసిన శంకర్.. స్థానిక సమరం నేపథ్యంలో వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుని ఓ అమ్మాయిని చూసి వివాహమాడాడు. ఆమెను నాగిరెడ్డిపూర్ ఓటర్ గా చేర్చి… సర్పంచ్ పీఠంపై తను కాకుంటే.. తన భార్యను కూర్చోబెట్టి చక్రం తిప్పాలనుకున్నాడు. కానీ, తాననుకున్న సమయం కంటే ముందే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో బుధవారం హడావిడిగా ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. కానీ, అప్పటికే ఓటర్ జాబితాలో దరఖాస్తు చేసుకోవడానికి ఆలస్యమైపోయింది. దాంతో ఓటర్ జాబితాలో తన భార్య పేరు నమోదు కాలేదు. సర్పంచ్ ఎన్నిక కోసం తొందరపడి పెళ్లి చేసుకుంటే… అసలు అసలు లక్ష్యం నెరవేరకపోవడంతో నారాజ్ అవుతున్నాడు శంకర్. కానీ, ఏదైతేనేం… సర్పంచ్ కాకపోయినా పర్లేదు.. ఓ ఇంటివాడివయ్యావుగా అంటూ చుట్టుపక్కలవారు దీవించారు…. పెళ్లి అయినందుకు బంధువులు సంబరపడుతుండగా… అందివచ్చిన ఛాన్స్ దక్కకపోవడంతో కక్కలేక మింగలేక పోతున్నాడట శంకర్..