
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో అనుమానాస్పద కదలికలు..! వైసీపీ నేతను విచారించిన ఎస్పీ..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఈ మధ్యే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.. అయితే, పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది.. దీనిపై జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన నరసింహ అనే వ్యక్తిని విచారించారు జిల్లా ఎస్పీ.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నరసింహ.. తాను రైతు గానే పవన్ కల్యాణ్.. రైతుల సమావేశానికి వచ్చానని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. కాగా, 50 మంది వైసీపీ నేతలకు రైతుల సమావేశానికి పాస్ లు ఇచ్చారట స్థానిక ఎమ్మెల్యే.. మొత్తంగా పవన్ పర్యటనలో అనుమానాస్పద కదలికలపై వైసీపీ కార్యకర్త నరసింహను ప్రశ్నించిన పోలీసులు.. అవసరమైతే మళ్లీ పిలుస్తామని నరసింహకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఇక, తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి 50 సార్లు రక్తదానం చేశానని పోలీసుల విచారణలో నరసింహ తెలిపినట్టుగా తెలుస్తుంది..
రెండో విడత ల్యాండ్ పూలింగ్..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడుతూనే.. రెండో విడత భూ సేకరణపై దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోన్న కేబినెట్ సమావేశంలో .. అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ విధివిధానాలపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. రాజధాని పరిధిలో మరిన్ని గ్రామాలను సేకరణ ప్రదేశాలుగా గుర్తిస్తూ, భూ సమీకరణ చర్యలకు వేగం పెంచనుంది ప్రభుత్వం. రెండో విడత భూ సమీకరణలో భాగంగా పరిశీలించిన గ్రామాల విషయానికి వస్తే.. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఉన్నాయి.. ఈ గ్రామాల్లో భూ లభ్యత, రికార్డులు, యాజమాన్యం, అభ్యంతరాలు వంటి అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించారు. మొత్తం 20,494 ఎకరాల భూమిని సేకరించనున్నారు.. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 20,494 ఎకరాల సేకరణ చేపట్టనున్నట్లు CRDA స్పష్టం చేసింది. త్వరలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అమరావతి రాజధానిలో మొత్తం భూ సమీకరణ లక్ష్యం మొదటి విడతలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరణ కాగా.. రెండో విడత లక్ష్యం అదనంగా 16,000 ఎకరాలుగా ఉంది.. మొత్తం రైతుల నుంచి భూ సమీకరణ 50,000 ఎకరాలు కాగా.. అదనంగా ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు CRDAకి అప్పగించనున్నారు.. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తం 70,000 ఎకరాల భూభాగం సిద్ధమవుతోంది.
రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం.. మాట్లాడే మీరు అర్హులు కాదు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి బీజేపీపై, ముఖ్యంగా బీజేపీ నేత లక్ష్మణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్‌కు అనుభవం, అవగాహన ఏమీ లేవని, చరిత్రకు గౌరవం తెలియదని మండిపడ్డారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “బీజేపీ లక్ష్మణ్ వయస్సు 69 ఏళ్లు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు. అప్పటికి ఆయనే పుట్టలేదు. అలా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ ఇంట్లో 3 ఎంపీ సీట్లు ఎందుకని మాట్లాడతాడా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పుట్టింది 140 ఏండ్ల క్రితం. మీ పార్టీ పుట్టింది 40 ఏండ్ల క్రితం. మా చరిత్ర, మీ చరిత్రకు 100 ఏళ్ల తేడా ఉంది. అర్హతలేని వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటయ్యింది అని అన్నారు. అలాగే, రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు దేశం మొత్తం తెలుసు. మీ బీజేపీలో ఎవరైనా అలాంటి త్యాగం చేశారా? అని ప్రశ్నించారు. లక్ష్మణ్… నోరు ఉంది అని ఎవరిపైనా మాట్లాడలేం. ముందుగా మీ అమ్మ–నాన్నను అడుగు. గాంధీ కుటుంబం అంటే ఏమిటో వాళ్లతో తెలుసుకో. దేవుళ్ల తర్వాత దేవుళ్లు వాళ్లే అని చెబుతారు అని జగ్గారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ దీక్ష నాటకం.. మహేష్ గౌడ్ ఫైర్
కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ ప్రకటించిన “దీక్షా దివస్”పై స్పందిస్తూ, బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పార్టీగా మారిందని, మళ్ళీ కనిపించేందుకు కొత్త నాటకాలే ఆశ్రయిస్తోందని అన్నారు. కేసీఆర్ గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర దీక్షను పూర్తిగా నాటకమని అభివర్ణిస్తూ, ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించుకున్నారని, విటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. “ఇది ఏ దీక్ష? ప్రజలు మోసపోయారు… కానీ నిజాలు బయటకు వచ్చాయి” అని ఆయన అన్నారు. అదే సమయంలో, “తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. వాళ్లే తమ ప్రాణాలు అర్పించి తెలంగాణను తెచ్చారు” అని తెలిపారు. “వచ్చిన తెలంగాణను మాత్రం కేసీఆర్, అతని కొడుకు, అతని మేనల్లుడు కలిసి దోచుకున్నారు. రాష్ట్రాన్ని కుటుంబ ఆస్తిలా భావించి పాలించారు” అని ఆరోపించారు. తెలంగాణ సృష్టిలో సోనియా గాంధీ పాత్రను గుర్తుచేసిన మహేష్ గౌడ్, “కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేయాలి. నిజమైన తెలంగాణ తల్లి ఆమె” అని అన్నారు.
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇరుముడితో విమాన ప్రయాణానికి ఏఏఐ గ్రీన్ సిగ్నల్
అయ్యప్ప స్వామి భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త తెలిపింది. శబరిమలకు వెళ్లే మాలధారులు విమానాల్లో ‘ఇరుముడి’ తో ప్రయాణించొచ్చని తాజాగా వెల్లడించింది. విమానంలో కొబ్బరికాయలను స్వాములు తమ వెంట తీసుకెళ్లొచ్చని చెప్పింది. అయ్యప్ప స్వాముల నుంచి వచ్చిన వినతుల మేరకు, వారి సౌకర్యార్థం నిబంధనలను సడలించామని ఏఏఐ పేర్కొంది. ఈ నిబంధన అక్టోబర్ 28 (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నిబంధనల సడలింపు అనేది వచ్చే ఏడాది జనవరి 20 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. అయ్యప్ప స్వాముల ప్రయాణం సాఫీగా, సేఫ్‌గా జరగడానికి కొబ్బరికాయలను క్యాబిన్లోకి తీసుకెళ్లే ముందు ఎక్స్ రే, ఎక్స్‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్షన్ (ఈటీడీ), భౌతిక తనిఖీలు ఉంటాయని పేర్కొంది.
భారత జీడీపీ దూకుడు.. రెండో త్రైమాసికంలో 8.2% నమోదు..
భారత ఆర్థిక వ్యవస్థ దూసుకు పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై- సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో GDP వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. గత త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదైంది. గత ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. గతేడాది ఇదే కాలానికి 5.6 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI), జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) యొక్క త్రైమాసిక అంచనాలను విడుదల చేసింది. ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల మధ్య బలమైన వినియోగదారుల వ్యయం, తయారీ రంగం కీలక ఇంజన్లుగా వృద్ధిరేటు పెరగడానికి సహకరించాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, వ్యవసాయం సహా కీలక రంగాల్లో పన్నులు తగ్గించడం కూడా వృద్ధికి దోహదపడింది. జీడీపీలో 14 శాతంగా ఉన్న తయారీ రంగం రెండో త్రైమాసికంలో 9.1 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 2.2 శాతంగా ఉంది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ‘‘వికసిత్ భారత్’’గా మారేందుకు, భారత్ స్థిరమైన ధరల వద్ద సగలున 8 శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని జనవరి 31న ప్రవేశపెట్టిన 2024-25 ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ పేర్కొంది. భారత్ డెవలప్డ్ కంట్రీగా మారాలంటే రాబోయే 22 ఏళ్లు సగటున 7.8 శాతం వృద్ధి చెందాల్సి ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.
“మూడో ప్రపంచ దేశాల” నుంచి వలసల్ని అనుమతించం.. భారత్ ఈ జాబితాలో ఉందా.?
వైట్ హౌజ్‌లో సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ‘‘మూడో ప్రపంచ దేశాల’’ నుంచి అమెరికాలోకి వలసల్ని శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలుకుంటుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. మెరుగైన జీవితం, విద్య, సొంత దేశాల్లోని హింస నుంచి తప్పించుకుని అమెరికాలోకి వలస వెళ్లే లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ, దాని వలస విధానం చాలా మంది జీవన పరిస్థితుల్ని నాశనం చేసింది’’ అని కామెంట్ చేశారు. బైడెన్ హయాంలో అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తామని చెప్పారు. అమెరికాను ప్రేమించలేని వారిని తొలగిస్తామని, అమెరికాకు చెందని వారి ఫెడరల్ ప్రయోజనాలను, సబ్సిడీలను ఇప్పటికే ముగించానని, పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీయుడినైనా బహిష్కరిస్తాననని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ఉపయోగం లేని వారిని, హత్యలకు నేరాలకు పాల్పడే వారిని దేశం నుంచి గెంటేస్తామని చెప్పారు.
జియో చౌకైన ప్లాన్.. రోజుకు 1GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను కాలానుగుణంగా అప్డేట్ చేస్తుంది. రూ. 209 ప్లాన్ ఇప్పుడు రోజుకు 1GB డేటాను మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ Jio.comలో జాబితాలో లేదు. MyJio యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు దీనిని వాల్యూ ప్లాన్స్ కేటగిరీ కింద అఫర్డబుల్ ప్యాక్స్ విభాగంలో కనుగొనవచ్చు. జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. 22 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 22GB వస్తుంది. ఈ ప్యాక్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, JioTV, JioAiCloud స్టోరేజ్ కు యాక్సెస్ వంటి బండిల్ చేయబడిన OTT ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజువారీ హై-స్పీడ్ కోటా అయిపోయిన తర్వాత, మిగిలిన రోజు డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. జియో ఇతర సరసమైన ప్లాన్లలో రూ. 799 ప్యాక్ (అపరిమిత వాయిస్, రోజుకు 100 SMS, రోజుకు 1.5GB, మొత్తం 126GB డేటా, 84 రోజుల వ్యాలిడిటీ) రూ. 189 ప్యాక్ (అపరిమిత వాయిస్, 300 SMS, 2GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ) ఉన్నాయి. రెండు ప్లాన్లు హై-స్పీడ్ డేటా పరిమితి అయిపోయిన తర్వాత 64 Kbps వద్ద అపరిమిత డేటాతో పాటు JioTV, JioAiCloud సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తాయి.
థియేటర్లలో టికెట్, స్నాక్స్, పార్కింగ్ దోపిడీపై ఆగ్రహం.. PYL ఆధ్వర్యంలో భారీ సంతకాల సేకరణ ప్రారంభం!
సినిమా థియేటర్లలో జరుగుతున్న దారుణ దోపిడీపై సాధారణ ప్రేక్షకుల నుండి యువజన సంఘాల వరకు మండిపడుతున్నాయి. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితేనే టికెట్ రేట్లను ఆకాశానికి చేరుస్తున్న థియేటర్లు, పండగ సీజన్లో అయితే మరీ రెట్టింపు ధరలు వసూలు చేస్తూ అభిమానుల జేబులకు చిల్లులు పెట్టిస్తున్నాయి. ఫ్యామిలీతో సినిమా చూసే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు థియేటర్ అనుభవం ఇప్పుడు విలాసంగా మారిపోయింది. టికెట్ ధరలు పెరిగినా కనీసం మంచి సేవలు అందిస్తారా అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు. సినిమాకు వెళ్లిన తరుణంలో టికెట్లు మాత్రమే కాదు, థియేటర్ లోపల స్నాక్స్ పేరుతో జరుగుతున్న దోపిడీ మరింత బాధాకరం. బయట 20 రూపాయలకు లభించే పాప్‌కార్న్‌కు థియేటర్లో 300-500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక వాటర్ బాటిల్‌కు 100-150 రూపాయలు, ఒక కప్పు కాఫీకి 250 రూపాయలు తీసుకోవడం ప్రేక్షకులపై పడుతున్న అదనపు భారంగా మారింది.
పాప పేరును రివీల్ చేసిన స్టార్ కపుల్..
బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ – కియారా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కియారా జులై 15న పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ స్టార్ కపుల్ తాజాగా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో నేడు వారి పాప పేరును సరాయా మల్హోత్ర (అర్థం యువరాణి) అని పెట్టినట్లు ప్రకటిస్తూ, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. నటి కియారా అడ్వాణీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర తొలిసారి 2021లో విడుదలైన ‘షేర్షా’ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదికాస్త కొంతకాలానికే ప్రేమగా మారడంతో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ఈ స్టార్ జోడీ 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల పరంగా కియారా అడ్వాణీ తెలుగు తెరకు సుపరిచితమే. ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడులైన వార్ -2లో కూడా కియారా అడ్వాణీ నటించారు. సిద్ధార్థ్ మల్హోత్ర సినిమాల విషయానికి వస్తే ఈ హీరో బాలీవుడ్లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ వారి పాప పేరును రివీల్ చేయడంతో వారి ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు.