Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines 9pm 29 11 2025

ఏపీకి అలర్ట్.. రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..

దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

10 గ్యాంగ్ లకు చెందిన 86 మంది బైండోవర్‌..

హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్, ఐపీఎస్ కఠిన చర్యలు తీసుకున్నారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ, ప్రత్యర్థి ముఠాలపై దాడులకు తెగబడుతున్న వారిని పోలీస్ కమిషనర్‌ విచారించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 126 కింద 86 మందిని కమిషనర్‌ బైండోవర్ చేశారు. రాబోయే ఏడాది కాలం పాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత సెక్యూరిటీ బాండ్లు రాయించుకున్నారు.

హోటల్లో పాచిపోయిన ఫుడ్.. తస్మాత్ జాగ్రత్త!

పర్యాటక నగరంగా పేరుగాంచిన విశాఖపట్నంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే హంగులతో ఆకర్షిస్తూ, లోపల మాత్రం రోజుల తరబడి నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారు. రుచి కోసం రకరకాల రంగులు, హానికరమైన రసాయనాలు కలుపుతూ ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా యాజమాన్యాల తీరు మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో హోటళ్ల అరాచకం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఏ రెస్టారెంట్ చూసినా కల్తీగా మారిపోయింది.

ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా నేటితో (నవంబర్ 29) మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తొలి రోజే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవుల కోసం 3,242 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

బప్పం స్టోరీ మొత్తం చెప్పిన రవి

హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ ఐబొమ్మ రవి పై మరో విడత కస్టడీ కఠిన విచారణ జరిపింది. రవి తన మెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన విషయాలను పోలీసులకు వివరించాడు. పోలీసులు గుర్తించినట్టు, ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్స్‌లో 21,000కి పైగా సినిమాలు పైరసీ చేయబడి ఉంటాయి. పోలీసుల పరిశీలనలో, రవి పైరసీ వెబ్‌సైట్స్ నుండి సినిమాలను రికార్డింగ్ చేసి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే సినిమాలను కూడా కాపీ చేశాడని గుర్తించారు. ఈ సినిమా రికార్డింగ్ కోసం రవి ఆడియో, వీడియో క్వాలిటీ పెంచడానికి కరేబియన్ దీవుల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పాడు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసాలు.. పోలీసుల కీలక సూచనలు..

హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలు హైదరాబాద్‌లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్‌ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం ఈ స్కాం కీలక లక్ష్యం. బాధితులకు వీడియో కాల్ లేదా ఫోన్ ద్వారా “అరెస్ట్ చేస్తున్నాం” అని నటిస్తూ, ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని, వారెంట్లు జారీ అయ్యాయని నమ్మించి మోసం చేస్తున్నారు. మోసగాళ్లు తమ కుట్రను బలపరచేందుకు నకిలీ FIRలు, వన్-బైలబుల్ వారెంట్లు, RBI లేఖలు వంటి కట్టుకథల డాక్యుమెంట్లు తయారు చేసి పంపిస్తారు. అనుమానం లేకుండా ఉండేందుకు కుటుంబ ప్రతిష్టకు హాని కలుగుతుందని చెప్పి ఒత్తిడి పెంచుతారు. కేసు నుండి బయటపడాలంటే భారీ మొత్తం డబ్బు సేకరించి “సుప్రీం కోర్టుకు డిపాజిట్ చేయాలి” అని చెప్పి వెంటనే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. కుటుంబ సభ్యులకు చెప్పొద్దని హెచ్చరిస్తూ సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను వినియోగిస్తారు.

సింధు లోయ నాగరికత ఎలా మాయమైంది.? ఐఐటీ సైంటిస్టుల పరిశోధన..

ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతల్లో ఒకటి ‘‘సింధులోయ నాగరికత’’. హరప్పా, మొహంజోదారో లాంటి గొప్ప పట్టణాలు 5000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయి. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్ లో ఈ నాగరికత సింధు నది వెంబడి ఏర్పడింది. అయితే, అనూహ్యంగా ఈ నాగరికత అదృశ్యమైంది. ఇంత గొప్ప సివిలైజేషన్ ఎలా నాశనం అయిందనే దానికి అనే సిద్ధాంతాలు ఉన్నాయి. కరువు, వరదల కారణంగా సింధు నాగరికత దెబ్బతిన్నట్లు చెబుతుంటారు. అయితే, ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన పరిశోధకులు హరప్పా, మొహంజోదారో, రాఖీగఢి, లోథాల్ వంటి పట్టణాలను ప్రజలు ఎందుకు విడిచి పెట్టాల్సి వచ్చిందనే దానికి కొన్ని కారణాలు వివరించారు. కరువుల ప్రభావం నాగరికతను దెబ్బతీసినట్లు వీరు చెబుతున్నారు. వ్యవసాయం, అభివృద్ధి చెందిన పట్టణాలు, డ్రైనేజ్ వ్యవస్థ వంటివి ఈ నాగరికతను ప్రత్యేకంగా నిలిపాయి. ‘కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ జర్నల్‌లో వచ్చిన రీసెర్చ్ పేపర్ ప్రకారం, నీటి కొరత వల్లే నాగరికత అంతరించిపోయినట్లు చెప్పింది.

ఏకంగా ప్రభుత్వ భూమిలో విల్లాలు.. రెయిన్‌బో మెడోస్ స్కామ్‌..!

సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటలో రెయిన్‌బో మెడోస్ నిర్మాణ సంస్థ పాల్పడిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ మోసం తాజాగా వెలుగు చూసింది. హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్‌గా నమ్మించి, పలు సర్వే నంబర్లలో ఏకంగా 40 విల్లాలను అక్రమంగా నిర్మించి అమాయక ప్రజలకు విక్రయించారు. ఇటీవల రెవెన్యూ అధికారుల సర్వేలో ఈ విల్లాలన్నీ సర్వే నంబర్లు 198, 199, 204, 208, 210లలోని ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విల్లాల కోసం ఒక్కో కుటుంబం రూ. 90 లక్షల నుంచి రూ. 1.1 కోటి వరకు వెచ్చించింది. మొత్తంగా, బాధితులు సుమారు రూ. 40 కోట్లకు పైగా పెట్టుబడిని నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మోసం వెలుగులోకి రాగానే, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. గతంలోనే కొందరు బాధితులు అనుమానం వ్యక్తం చేసినప్పుడు, ఆ భూమి ప్రభుత్వానిదని తేలితే తాము తీసుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రెయిన్‌బో మెడోస్ సంస్థ లిఖితపూర్వక ఒప్పందం (MOU) ఇచ్చింది. అయితే, ఇప్పుడు అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారణ కావడంతో, నిర్మాణ సంస్థ స్పందించకుండా ముఖం చాటేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పరిస్థితి విషమం.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలీదా జియా(80) ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించడంతో ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమె పరిస్థితి చాలా విషమంగా మారిందని ఆమె సన్నిహిత సహాయకుడు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. జియా చాలా కాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, అర్థరైటిస్‌, కంటి సంబంధిత వ్యాధులతో సహా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్‌గా ఉన్నారు. 2008 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. షేక్ హసీనా గతేడాది ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత నుంచి బంగ్లాదేశ్‌లో బీఎన్పీ మళ్లీ క్రియాశీలకంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఖలీదా జియా వైద్యం కోసం లండన్ వెళ్లి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరింది.

ఎన్నికలకు ఒక రోజు ముందు, బీజేపీలో చేరిన ఆప్ కీలక నేత..

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రెండుసార్లు ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ గుప్తా బీజేపీలో చేరారు. దీంతో,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో గుప్తా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వీడటానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘అన్నా హజారే ఆందోళన సమయంలో ఉద్యోగాలు వదిలి వచ్చిన వారిని ఇప్పుడు ఆప్ పట్టించుకోవడం లేదు. చాలా మంది ఆప్‌ను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆప్ కార్యకర్తల్ని వాడుకుని వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. తాను చాలా ఏళ్లుగా పార్టీకి చేసిన కృషికి, పనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గౌరవం ఇవ్వలేదని అన్నారు. తాను పార్టీ, దేశం మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితుల్లో దేశాన్ని ఎంచుకున్నానని గుప్తా అన్నారు. అయితే, ఆయన పార్టీ వీడటంపై ఆప్ ఇంత వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. నవంబర్ 30న ఖాళీగా ఉన్న 12 వార్డులకు ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఈ చేరిక బీజేపీకి బూస్ట్ ఇచ్చింది.