
TPCC Mahesh Goud : కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్‌ఎస్ ప్రకటించిన “దీక్షా దివస్”పై స్పందిస్తూ, బీఆర్‌ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పార్టీగా మారిందని, మళ్ళీ కనిపించేందుకు కొత్త నాటకాలే ఆశ్రయిస్తోందని అన్నారు. కేసీఆర్ గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర దీక్షను పూర్తిగా నాటకమని అభివర్ణిస్తూ, ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించుకున్నారని, విటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. “ఇది ఏ దీక్ష? ప్రజలు మోసపోయారు… కానీ నిజాలు బయటకు వచ్చాయి” అని ఆయన అన్నారు.
అదే సమయంలో, “తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. వాళ్లే తమ ప్రాణాలు అర్పించి తెలంగాణను తెచ్చారు” అని తెలిపారు. “వచ్చిన తెలంగాణను మాత్రం కేసీఆర్, అతని కొడుకు, అతని మేనల్లుడు కలిసి దోచుకున్నారు. రాష్ట్రాన్ని కుటుంబ ఆస్తిలా భావించి పాలించారు” అని ఆరోపించారు. తెలంగాణ సృష్టిలో సోనియా గాంధీ పాత్రను గుర్తుచేసిన మహేష్ గౌడ్, “కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేయాలి. నిజమైన తెలంగాణ తల్లి ఆమె” అని అన్నారు.
అమరవీరులకే తెలంగాణ రుణపడి ఉందని, కేసీఆర్ పేరుకు మాత్రమే ఉద్యమం నడిపాడని వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ, “హరీష్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టడానికి ధైర్యం దొరకలేదు. దళితులు, బీసీలకు అయితే అగ్గిపెట్టె కూడా దొరికింది” అని అన్నారు. బీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రజా ఆమోదం కోల్పోయి, కొత్త రాజకీయ స్థానం కోసం ప్రయత్నిస్తోంది అని పేర్కొన్నారు. “కేసీఆర్‌కు కూడా బీఆర్‌ఎస్ శకం ముగిసిన విషయం తెలుసు. అందుకే అసంబద్ధ దీక్షలు, కార్యక్రమాలతో ప్రజల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు.
SSC Recruitment 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 7,948 ఎంటీఎస్, హవల్దార్ జాబ్స్..
రాష్ట్రంలోని కార్పోరేషన్ చైర్మన్‌ల పదవులకు కొనసాగింపు లేదని, వారు ఇకపై DCCలుగానే పనిచేస్తారని తెలిపారు. ఈ క్రమంలో నల్గొండ DCC అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తాను కలిసిన విషయం స్పష్టం చేశారు. గతంలో పున్నా కైలాస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆయన కోమటిరెడ్డికి వివరణ ఇచ్చారని చెప్పారు. బీజేపీ-ఓవైసీ సంబంధాలపై వ్యాఖ్యానిస్తూ.. “బీజేపీ నేతలు ఓవైసీని తలుచుకోకుండా టిఫిన్ కూడా తినలేరు. రోజంతా ఓవైసీ జపమే. వాళ్ల సమస్య వాళ్లదే… దానికి మనం ఏమి చేయలేము” అన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ, త్వరలో ప్రధానిని కలవనున్నట్లు వెల్లడించారు. బీసీ బిల్లుకు అడ్డుకట్ట వేస్తున్నది బీజేపీ అని ఆరోపించారు. “బీసీ నేతలు కాంగ్రెస్‌ని నిలదీయడం కాదు… అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నిలదీయాలి. సాయం చేసినవారి ఇంటి ముందు నిరసన ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు.
“మేము బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం. మాపై ఆందోళనలు చేస్తే నష్టమైతే ప్రజలకే” అని స్పష్టం చేశారు. తాను నక్సలైట్ బాధితుడినని గుర్తుచేసుకున్న మహేష్ గౌడ్, కాంగ్రెస్ ఎలాంటి హింసను కూడా సమర్థించదని తెలిపారు. “పోలీసుల కాల్పుల్లో కూడా కొందరు చనిపోయారు. మావోయిస్టుల చేతుల్లో కూడా ప్రాణాలు పోయాయి. కానీ ఏ హింసనూ సమర్థించను” అని అన్నారు. జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి అవకాశం ఇవ్వాలని, కానీ లొంగిపోవడానికి అవకాశం ఇవ్వకుండా కాల్చివేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
Asia Power Index 2025: ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌కు 3వ స్థానం.. చైనా, పాక్ ర్యాంకులు ఎంతంటే..