
వైట్‌హౌస్ దగ్గర కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేద దేశాల నుంచి శాశ్వతంగా వలసలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ దగ్గర ఆప్ఘన్ జాతీయుడు రెహ్మానుల్లా కాల్పులకు తెగబడ్డాడు. ఇద్దరు నేషనల్ గార్డ్స్‌పై కాల్పులు జరపగా సారా బెక్‌స్ట్రోమ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా.. ఆండ్రూ వోల్ఫ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు.
‘‘కాల్పుల నేపథ్యంలో థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నా. జో బైడెన్ ఆటోపెన్‌తో సంతకం చేసిన లక్షల మంది అక్రమ అడ్మిషన్లు రద్దు చేస్తున్నాం. అమెరికాకు ఆస్తి కాని వారిని.. దేశాన్ని ప్రేమించని వ్యక్తులను ఇక్కడి నుంచి పంపించేస్తాం. అమెరికాయేతర పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేస్తాం. దేశ ప్రశాంతతకు భంగం కలిగించే వారిని.. అమెరికన్ల భద్రతకు ముప్పుగా మారే వారిని బహిష్కరిస్తాం.’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Musk: మళ్లీ బలపడుతున్న ట్రంప్-మస్క్ స్నేహం.. తాజా ఫొటోనే సంకేతం!
ఇప్పటికే గ్రీన్ కార్డు హోల్డర్స్‌ను సమీక్షించాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో ఆప్ఘన్‌తో పాటు మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ను అధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలకు అని పిలిచి అరెస్ట్‌లు కూడా చేస్తున్నట్లు సమాచారం. తాజాగా పేద దేశాల నుంచి శాశ్వతంగా వలసలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇవే…
ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధి చెందక పేదరికంతో కొట్టిమాట్లాడుతున్నాయి. ఇందులో ప్రధానంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలు ఉన్నాయి. ఆదాయం తక్కువ కలిగిన దేశాలుగా లెక్కిస్తుంటారు. ఇందులో అప్ఘనిస్థాన్, పాకిస్థాన్, దక్షిణ సూడాన్, సోమాలియా, నైగర్, బుర్కినా ఫాసో, బురుండి, మడగాస్కర్, ఇథియోపియా, లైబీరియా, సిరియా, ఉగాండా దేశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ram Madhav: యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదు.. పీకేపై రామ్ మాధవ్ విసుర్లు
ఇదిలా ఉంటే కాల్పుల తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు జంతువు.. పిచ్చోడు అంటూ మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం కారణంగానే ఇదంతా జరిగిందంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జో బైడెన్‌ను ఎందుకు నిందిస్తున్నారంటూ నిలదీసిన విలేకరిపై కూడా ట్రంప్ మండిపడ్డారు. తెలివి తక్కువవారా? అంటూ పదే పదే రుసరుసలాడారు.
నిందితుడు రహ్మానుల్లా లకన్వాల్ ఆప్ఘన్ జాతీయుడుగా గుర్తించారు. 2021 ఆగస్టులో ఆప్ఘన్‌స్థాన్‌లో బైడెన్ ప్రభుత్వం అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంది. దీంతో తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆ సమయంలో బైడెన్ ప్రభుత్వం ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్ పునరావాస కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 70, 000 ఆప్ఘన్ జాతీయులు అమెరికాలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించినవాడే రహ్మానుల్లా. బైడెన్ నిర్ణయం కారణంగానే ఈరోజు అమెరికాలో ఉగ్ర దాడి జరిగిందంటూ ట్రంప్ ఫైరయ్యారు.
పునరావాస కార్యక్రమం ద్వారా ప్రవేశించిన వారికి శాశ్వత హోదా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. రహ్మానుల్లా కూడా డిసెంబర్ 2024లో శాశ్వత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రంప్ అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత.. అనగా ఏప్రిల్ 23న ఆమోదించబడింది. రహ్మానుల్లా ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివాసం ఉంటున్నాడు.