Trump-Musk: మళ్లీ బలపడుతున్న ట్రంప్-మస్క్ స్నేహం.. తాజా ఫొటోనే సంకేతం!

Trump Musk Dined On Thanksgiving Day

అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోనే ఉదాహరణగా ఉంది. గురువారం థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని లంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: కాల్పుల ఎఫెక్ట్.. గ్రీన్‌ కార్డ్ హోల్డర్స్‌కు కష్టాలే!.. ట్రంప్ కీలక ఆదేశాలు

గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-మస్క్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు బాగానే కలిసి మెలిసి ఉన్నారు. ఎప్పుడూ ఓవల్ కార్యాలయంలోనే కొడుకును భుజంపై కూర్చోబెట్టుకుని మస్క్ కనిపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. ట్రంప్ తీసుకొచ్చిన ‘‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’’ను, ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయాల్సిందేనంటూ మస్క్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం పూర్తిగా దెబ్బతింది. చాలా నెలలుగా మస్క్ వైట్‌హౌస్‌కు దూరంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Ram Madhav: యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదు.. పీకేపై రామ్ మాధవ్ విసుర్లు

ఈ క్రమంలోనే ఇటీవల ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఇక ఈనెల ప్రారంభంలో వైట్‌హౌస్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ట్రంప్ విందు ఇచ్చారు. ఈ విందుకు మస్క్ కూడా హాజరై కనువిందు చేశారు. అంతేకాకుండా ట్రంప్ లోపలికి వస్తూ.. మస్క్‌ను ప్రత్యేకంగా భుజం తట్టారు.

తాజాగా మరోసారి గురువారం జరిగిన థాంక్స్ గివింగ్ కార్యక్రమంలో ట్రంప్-మస్క్ కలిశారు. విందులో పక్కపక్కనే కూర్చుని లంచ్ ఆరగించారు. ఈ విందులో అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ లతో కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చింది. దీంతో ట్రంప్-మస్క్ మళ్లీ కలిసిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటోను కెన్నెడీ పోస్ట్‌ చేశారు. ‘‘హ్యాపీ థాంక్స్ గివింగ్’’ అంటూ రాసుకొచ్చారు.

థాంక్స్ గివింగ్ డే..
థాంక్స్ గివింగ్ అనేది పంట మరియు ఏడాది పొడవునా పొందిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపే వార్షిక పండుగ. ఇది యునైటెడ్ స్టేట్స్‌తో పాటు కెనడాలో నిర్వహిస్తుంటారు. దీన్ని పురస్కరించుకుని జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. ప్రతి ఏడాది నవంబర్‌లో చివరి గురువారం రోజున నిర్వహిస్తారు. అమెరికా మూలాలు ప్రకారం.. 1621లో ప్లిమౌత్‌లో యూరోపియన్ వలసవాదులు- వాంపానోగ్ ప్రజల మధ్య జరిగిన ఒక పంట విందుకు సంబంధించి ఈ డేను నిర్వహిస్తారు.