
ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి మనం దూరంగా ఉండగలుగుతాము. అయితే చాలా మంది వ్యాయామం చేయడానికి బద్ధకిస్తూ ఉంటారు. పిల్లల నుండి వృద్ధుల వరకు—అన్ని వయస్సులవారు ఏదో ఒక రకమైన శారీరక శ్రమను తప్పనిసరిగా చేయాలి. వ్యాయామానికి కూడా ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకటించింది. ఈ పరిమితిని మించి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి రోజుల్లో ఒక బాలీవుడ్ నటుడు అధిక వ్యాయామం చేయడం వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయన తనకు తీవ్రమైన శారీరక శ్రమ కారణంగా మూర్చ వచ్చినట్లు తెలిపారు. అందువల్ల ప్రతి వయసు వర్గానికి సరిపోయే వ్యాయామ పరిమితిని పాటించడం ఎంతో కీలకమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.
WHO ప్రకారం వయస్సుల వారీగా వ్యాయామ పరిమితులు
5 నుండి 17 సంవత్సరాల పిల్లలు
వారానికి కనీసం 3 రోజులు ప్రతిసారి మితమైన లేదా తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన వ్యాయామం చేయాలి. ఏరోబిక్ కార్యకలాపాలు, అలాగే కండరాలు–ఎముకలను బలపరిచే వ్యాయామాలు ఉండాలి.
18 నుండి 64 సంవత్సరాల పెద్దలు
వారానికి 150–300 నిమిషాలు మితమైన వ్యాయామం లేదా 75–150 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది. వారంలో కనీసం రెండు రోజులు బరువు ఎత్తే (స్ట్రెంగ్త్ ట్రైనింగ్) వ్యాయామాలు చేయాలి.
65 ఏళ్లు పైబడిన వారు
వారానికి 150–300 నిమిషాలు మితమైన తీవ్రత గల వ్యాయామం. కండర ద్రవ్యరాశి తగ్గకుండా ఉండేందుకు వారంలో 2–3 సార్లు బరువు లేదా రెసిస్టెన్స్ శిక్షణ చేయాలి. బ్యాలెన్స్ మెరుగుపరిచే వ్యాయామాలు (సంతులనం కోసం) కూడా చేర్చడం మంచిది.
గర్భిణీలు & బాలింతలు
వారానికి 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలని WHO సూచిస్తుంది. ఏ వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుడి సలహా తప్పనిసరి.
నిపుణుల సూచనలు
వ్యాయామం ప్రారంభించే ముందు సాధారణంగా 5–10 నిమిషాలు వాకింగ్ లేదా లైట్ వార్మ్-అప్ చేయాలని వ్యాయామ శాస్త్రవేత్త కరోల్ ఎవింగ్ గార్బర్ సూచిస్తున్నారు. బలం పెంచుకోవాలనుకునే వారికి కాలిస్టెనిక్స్, వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్లు, చాలా ఉపయోగకరం.
ముఖ్య సూచన
పై సమాచారం విశ్వసనీయ వనరుల ఆధారంగా ఇచ్చినప్పటికీ, మీరు ఈ మార్గదర్శకాలను అనుసరించే ముందు ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ లేదా వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.